శ్రీ విష్ణు పురాణం 76వ భాగం:-
శ్రీ విష్ణు పురాణం
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః
శ్రీ గురుభ్యోనమః
76వ భాగం:-
దేవదానవులకు జరిగిన యుద్ధంలో దేవతలపక్షాన ఉండి రాక్షసులను తునుమాడి దేవతలవల్ల రెండు వరాలు పొందాడు.
యుద్ధశ్రమ తీరేట్లు చాలాకాలం సుఖనిద్ర పొందడం.
నిద్రలో ఉండగా వచ్చి బలాత్కారంగా లేపిన వారు తన కోపదృష్టిచే వెంటనే చనిపోవడం -
అలా నిద్రలోఉన్న ముచికుందుణ్ణి చూసి కాలయవనుడు కృష్ణుడే అనుకుని ఎడమకాలితో తన్నాడు. ఆ తాపుతో ముచికుందుడు మేల్కొని కోపించి చూడగా ఆ చూపులోంచి వచ్చిన కోపాగ్నిజ్వాల తగిలి యవనరాజు నిలువుగా కాలి బూడిదయై కిందపడ్డాడు. చాటుగా ఉన్న కృష్ణుడు ముచికుందుని ముందుకు వచ్చాడు.
ఎవరు నువ్వు? అని రాజు ప్రశ్న.
వసుదేవుడు అనే యాదవుని కొడుకును --నన్ను కృష్ణుడు అని ఆ మాట విని ముచికుందుడు చప్పున లేచి కృష్ణునకు సాష్టాంగంగా నమస్కరించి స్తుతించాడు.
దేవదేవా! దేవదానవ యుద్ధం అయిన తరువాత ఇంద్రుని మాటపై ఈ కొండగుహలో నిద్రించడానికి నేను వస్తూ ఉండగా గార్డ్యుడనే ముని నన్ను చూచి...
రాజా! ద్వాపరయుగాంతమందు భూభారం తీర్చడానికి మహావిష్ణువు యదువంశంనందు దేవకీ వసుదేవుల కొడుకుగా జన్మిస్తాడు. కృష్ణుడు అనే పేరుగలవాడు. 'నీకా దేవుని దర్శనం అవుతుంది. శుభప్రదు డౌతావు' అని చెప్పాడు. శ్రీకృష్ణా! దయచేశావా?
ముచికుందుని మాట విని ముకుందుడు ప్రసన్నుడై అన్నాడు. రాజా! నా మాటవల్ల దివ్యభోగాలనుభవించి మంచి వంశంలో పుట్టి వైభవం పూర్వజన్మ జ్ఞానం కలిగి నీకిష్టమైన లోకంలో ఉండు. తరువాత జన్మాంత మందు మోక్షం పొందు - అని వరాలిచ్చి బయటికి వచ్చి వెళ్లిపోయాడు.
రాజు వెలుపలకు వచ్చి నలువైపులా చూశాడు. స్వల్పంగా ఉన్న జనసమూహాన్ని చూశాడు. ఓ - ఇక కొన్నాళ్లకి కలియుగం ఆరంభం అని తెలుస్తూంది. స్వజనం మధ్య ఉండలేను అని అసహ్యించుకుని గంధమాదన గిరికి పోయి తపశ్చర్యను ఆరంభించాడు.
కృష్ణుడు శత్రువులను పరిమార్చి వారి సంపదలను సంగ్రహించి తెచ్చి తాతకిచ్చాడు. ఆ విధంగా కృష్ణసంరక్షణంలో యాదవవంశం అభ్యుదయాభివృద్ధి గలదై రాణించింది. అలా ఉండగా...
ఒకనాడు బలభద్రుడు కృష్ణునితో చెప్పి గోకులం వెళ్లాడు. యశోదా నందులకు నమస్కరించి గోపకులను పలకరించి కానుకలిచ్చి గోపికలకు వస్తువస్త్రాలనిచ్చి ఆనందంగా విహరిస్తూ ఉండగా ఒకనాడు వరుణుడు వచ్చాడు. బలరామునకు వివిధ మణిమయభూషణాలిచ్చి ఇష్టాగోష్ఠి జరిపాడు. కొంతసేపయిన తరువాత బలరాముడు అడిగాడు.
ఏమయ్యా! ఒక కాలంలో నీ నుంచి వచ్చిన వారుణిని (మద్యం) సేవిస్తారు కొందరు పెద్దలు - దానివల్ల కలిగే ఫలమేమి?
వరుణుడు చెప్పాడు. దేవదానవులు అమృతంకోసం పాల సముద్రాన్ని తఱుస్తూఉండగా అమృతంకన్న ముందు వచ్చింది అది. రోగాలను పోగొట్టుతుంది. బలవృద్ధిని కలిగిస్తుంది. ఆనందంగా విహరించేట్టు చేస్తుంది. దానిని సేవిస్తూనే కదా దేవదానవులు పరమానందంగా కాలం గడుపుతున్నారు. సురను సేవించనివారిబ్రతుకు ఒక బ్రతుకా? నువ్వు కూడా నేటినుంచి సురాపానం చేస్తూ ఉండు! అని కొనియాడి వారుణి కలశు బృందావనమందున్న ఒక చెట్టు తొర్రలో ప్రతిష్ఠించివెళ్లి వెళ్లిపోయాడు. ఆ మద్యగంధం ఆ ప్రాంతానికి అభినవశోభను కూర్చింది.
ఒకనాడు బలరాముడు తనవారితో ఆ ప్రాంతమందు తిరగడానికి రాగా ఆ మద్యగంధం గాలికి ఎగిరి బలరామునికి ఆసక్తిని కలిగించింది. వెంటనే అలావచ్చినవైపు వెళ్లి వేప వృక్షం తొర్రలో ఉన్న వారుణీ కలశం తీసుకున్నాడు. ఇది వరుణుడు ఉంచినదే అని భావించాడు.
యమునాతీరమందున్న బృందావనంలో గోపికలతో కలిసి సవిలాసంగా మద్యపానం చేశాడు.
కొందరు గోపికలు కూడా మద్యపానం చేసి వింత పలుకులతో విలాసాలతో విర్రవీగుతూన్నట్టు నటించనారంభించారు. కొంతసేపు వారితో వినోదించి అలసి సొలసి జలక్రీడకు సంకల్పించి మదిరాపానమత్తుడై వెళ్లలేక యమునను తనకు దగ్గరగా రమ్మని ఎలుగెత్తి పిలిచాడు. రాలేదు.
దానితో కోపించి ఓ యమునా! ఇదిగో చూడు నా చేతితోగాని, దీనితో నీ బ్రతుకు వెయ్యి బారలు వేస్తాను. నా పిలుపు వినిపించలేదా? అంత మదించి ఉన్నావా? అని లేచి యమున గట్టుకి వెళ్లి నాగలిని నీళ్లలో ముంచి లాగేడు. పెద్ద ధ్వని. అది విని వేల్పును పైనుంచి ఆశ్చర్యంగా చూస్తూ నిల్చున్నారు. అంతట యమున పెద్ద పెద్ద పాయలై బృందావనంలో ప్రవేశించింది. బలరాముడు భార్యయైన రేవతితో గోపికలతో ఆ నీళ్లలో జలక్రీడలాడుతూండగా వారి ఆటలు సహించలేక యమున నిజరూపంతో ఎదుట నిల్చి బ్రతిమాలింది. సరే. భయపడకు. వెళ్లు! అని - జలక్రీడలు ఆపి బృందావనంలో రేవతితో వినోదిస్తూ ఉన్నాడు.
ఇలా వినోదిస్తూ ఉండగా ఒకనాడు వరుణుడు నల్ల కలువవన్నె తలపాగ, కనక రత్నకుండలాలు, నీలాంబరం, తెల్లని పట్టుగొడుగు ఇచ్చి వెళ్లగా బలరాముడు ఆనందించి వాటిని ఉపయోగిస్తూ రెండు మాసాలు గోకులంలో గడిపి కృష్ణ సందర్శనకు హలంతో ద్వారకకు వెళ్లాడు.
ఆ కాలంలో విదర్భదేశాధీశుడు కుండినపురంలో నివసిస్తూన్న వాడు భీష్మకుడు అనేరాజు. అతనికి పెద్దకొడుకు రుక్మి. ఒకే ఒక్క కూతురు. పేరు రుక్మిణి. ఆమె రూపరేఖావిలాసాలకు ముమ్మరించి ఎందరో రాకుమారులు తనకంటే తనకని అడిగించేవారు. కాని ఎవ్వరికోరికా తీరలేదు. కృష్ణుని వరించాలని రుక్మిణి నిశ్చయం. రుక్మిణిని పరిగ్రహించాలని కృష్ణుని సంకల్పం కాని ఆమె పెద్దన్న రుక్మి - శిశుపాలునికివ్వాలని పట్టుదల గలవాడై ఉన్నాడు. కబురంపాడు రమ్మని. జరాసంధాదులతో...
రేపటి భాగంలో మళ్లీ కలుసుకుందాం...
- సర్వేజనా సుఖినో భవంతు
- శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #vishnupuranam #srivishnupuranam #astrovidhaataa #Astrology #numerology
Namasthe
ReplyDelete