ధర్మో రక్షతి రక్షితః అంటే.??


 

ధర్మో రక్షతి రక్షితః

              

జగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహత్కార్యం మరొకటి లేదు.


మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం.


మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదీ ధర్మమే.


ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది.


ధర్మాన్ని కాపాడటమంటే- అన్నివేళలా ధర్మాన్నే ఆచరించాలి.


ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుందని, అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి చెబుతోంది.


శ్రీమద్రామాయణాన్ని రచించిన వాల్మీకి   శ్రీరాముడి గుణగణాలు వర్ణిస్తూ ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటాడు.


అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. సమస్త ధర్మాలూ ఆయనలోనే ఉన్నాయి.


అందుకే ఆయన అందరికీ ఆరాధ్యదైవమయ్యాడు.


మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏయే ధర్మాలు పాటించాలో విపులంగా వివరించి చెప్పింది మహాభారతం.


ఏ కర్మలైతే మనోవాక్కాయాలకు బాధ కలిగిస్తాయో ఆ విపరీత కర్మలను ఇతరుల విషయంలో ఆచరించకూడదు.


అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా భారతాన్ని భావిస్తారని నన్నయ చెబుతాడు.


వ్యాసమహర్షి కోటిగ్రంథాల్లో చెప్పినవాటిని అర్ధశ్లోకంలో వివరిస్తున్నానని ఈ విధంగా ఉపదేశిస్తారు…


ఇతరులకు మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది. చెడు చేస్తే పాపం కలుగుతుంది. ఇదే అసలైన ధర్మసూక్ష్మం.


ధర్మాచరణమే పరమధర్మమని, సచ్ఛీలమే తపస్సని, సచ్ఛరిత్రమే పరమ జ్ఞానమని బోధిస్తారు మహాత్ములు.


బ్రహ్మచారి అయిన శ్రవణ కుమారుడు సంధ్యావందనాది విహిత కర్మలు చేస్తూ, వృద్ధులు, అంధులు అయిన తల్లిదండ్రుల సేవచేస్తూ ఆత్మశక్తిని పెంపొందించుకున్నాడు.


ధర్మవ్యాధుడు స్వధర్మ ఆచరణతోపాటు తల్లిదండ్రులకు, అతిథులకు సేవచేస్తూ వేదవిహిత కర్మలతో తపోశక్తిని సాధించిన కౌశికుడనే బ్రాహ్మణుడికి తత్వోపదేశం చేశాడు.


కుక్కుటముని తనకు సమీపంలో ఉన్న గంగను, కాశీని సేవించక తల్లిదండ్రుల సేవలోనే పరమార్థాన్ని గ్రహించాడు.


అందుకే మనిషి తాను చేసే ప్రతి పనినీ పరమాత్మ పూజగా భావించాలి.


ధర్మాచరణతో అందరికీ తోడ్పడాలి.


భోగాలను విడిచి త్యాగగుణం పెంచుకొమ్మంటుంది ధర్మం.


అహంకారం వదిలి ఆత్మతత్వం గ్రహించమని చెబుతుంది.


యుద్ధానికి సిద్ధమైన దుర్యోధనుడు తల్లిదీవెన కోసం గాంధారి దగ్గరికి వెళ్ళి తనకు జయం కలిగేలా దీవించమంటాడు.


అప్పుడు గాంధారి, ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుందని దీవిస్తుంది.


ఆమె దీవించినట్లుగానే ధర్మపరులైన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు.


ధర్మ ప్రాశస్త్యాన్ని గురించి చాణక్యుడు తాను రాసిన చాణక్య నీతిలో ఇలా వివరిస్తాడు...


మానవుడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని భూమిపైన, గోసంపదను పశువుల శాలలో విడిచి మరణిస్తున్నాడు. భార్య ఇంటి ముంగిట్లోనే ఆగిపోతుంది. మిత్రులు స్మశానం వరకు వచ్చిపోతారు. ఎంతో ప్రేమగా పోషించుకున్న శరీరం చితిమంటల్లో భస్మమైపోతుంది. జీవుడితో వెళ్లగలిగేది ధర్మం ఒక్కటే.


తన శ్రేయం కోరకుండా అందరి అభ్యుదయం కోరడం ఉత్తమధర్మం. నిస్సహాయులకు, వృద్ధులకు సహాయం అందించడం మానవతా ధర్మం.


ఇతరుల నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని నీవు ఇతరులకు చేయడం నిజమైన ధర్మం.


ధర్మాన్ని అనుసరించినవారిని ఆ ధర్మమే రక్షిస్తుంది.


ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ ఉంటుంది.


ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ ధర్మం విడవకూడదని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.


🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.. 


జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025