కార్తీకపురాణం - 5 వఅధ్యాయము - karthika Masam



 కార్తీకపురాణం - 5 వఅధ్యాయము.

             

వనభోజన మహిమ:

కిరాత మూషికములు మోక్షము నొందుట!


ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు 

వెళ్ళుదురు. భగవద్గీత కొంత వరకు పఠించిన  వారికి విష్ణు లోకం ప్రాప్తించును. కడ కందలి శ్లోకము లో నొక్క పదమైననూ కంఠస్థమొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యధోచితంగా  పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి,  ఉసిరి చెట్టు నీడన  భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును.

వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం  చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను” - యని  వశిష్టుల వారు  చెప్పిరి. 


అది విని జనక రాజు 'ముని వర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల  కారణమేమి యని' ప్రశ్నించగా వశిష్టుల వారు ఈవిధంబుగా చెప్పనారంబించిరి.


కిరాత మూషికములు మోక్షము నొందుట```


“రాజా! కావేరి తీర మందొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు.అతని పేరు శివశర్మ. చిన్న తనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై  మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి 'బిడ్డా ! నీ దురాచారములు అంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొను చున్నారు. నన్ను నిలదీసి  అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన, నువ్వు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటులచేయు' మని భోదించెను. 


అంతట కుమారుడు 'తండ్రీ! స్నానము చేయుట..  వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా ?' అని వ్యతిరేకర్ధములతో పెడసరంగా సమాదాన మిచ్చెను. 


కుమారుని సమాధానము విని, తండ్రి 'ఓరి నీచుడా! కార్తీక మాస ఫలము నంత చులకనగా చుస్తునావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొర్ర యందు ఎలుక రూపములో బ్రతికేదవుగాక' అని కుమారుని శపించెను. 


ఆ శాపంతో కుమారుడగు శివశర్మ కు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి “తండ్రీ  క్షమింపుము. అజ్ఞానాంధకారంతో కరములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకన చేసి వాటి ప్రభాములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు  పశ్చాత్తాపము కలిగినది. ఆనక శాపవిమోచనమెప్పుడు  ఏవిధముగా కలుగునో దానికి తగు తరుణోపాయ వివరింపు'మని ప్రాధేయ పడెను. 


అంతట తండ్రీ 'బిడ్డా! నా శాపమును అనుభవించుచు మూషికమువై  ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు’ అని కుమారుని వూరడించెను. 


వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను.


ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న ఆ పెద్ద వట వృక్షము నీడన కొంత సేపు విశ్రమించి, లోకాభి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. 


ఇట్లు కొంత కాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షి విశ్వామిత్రులవారు శిష్యాసమేతముగా  కావేరి నదిలో స్నానర్ధమై బయలుదేరినారు. 


అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వట వృక్షం క్రిందనకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. 


ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. 


అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని 'వీరు బాటసారులై వుందురు. వీరి వద్ద నున్న ధనమపహరించ వచ్చు' ననెడు దుర్భుద్దితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిశ్వరులే! వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి 'మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది.  గాన, వివరింపుడు'అని ప్రాధేయపడెను. 


అంత విశ్వా మిత్రులవారు 'ఓయి కిరాతక! మేము కావేరి నది స్నానర్దామై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నాన మాచరించి కార్తీక పురాణమును పఠిన్చుచున్నాము. నీవును యిచట కూర్చుని సావధానుడవై ఆలకింపుము' అని చెప్పిరి. 


అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్దగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ వృత్తాంత మంతయు జ్ఞాపకమునకు వచ్చి , పురాణ శ్రవణానంతరము  వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. 

అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది 

'ముని వర్యా! ధన్యోస్మి  తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడనైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. 

కనుక జనకా! ఇహములో సిరి సంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించవలెను.


ఇట్లు స్కాంద పురాణాంతర్గత  వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి

ఐదవ అధ్యయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.


      🙏  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు..


జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.