("వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి")




చక్రత్తాళ్వార్ (సుదర్శనచక్రం) 

చక్రత్తాళ్వార్ గా పిలువబడే "సుదర్శనచక్రం", రెండడుగుల ఎత్తు కలిగి, చక్రాకారంలో 16 కోణాలు కలిగి, పంచలోహ నిర్మితమై, ఆరంగుళాల ఎత్తైన, వెండి చతురస్రపీఠంపై విరాజిల్లు తుంటుంది. ప్రతి సంవత్సరం నాలుగు సందర్భాలలోచక్రత్తాళ్వార్ కు స్వామిపుష్కరిణిలో చక్రస్నానం గావిస్తారు. 

స్వామివారి పరమాయుధమైన సుదర్శనచక్రం పూర్వయుగాలలో ఎందరో దైత్యులను సంహరించింది. చక్రాయుధానికి స్వామివారు ప్రత్యేకంగా అనుజ్ఞ ఇవ్వనవసరం లేదు. స్వామివారి చిత్రాన్ని, సంకల్పాన్ని, భక్తుల వాంఛితాలను గుర్తెరిగి, శిష్టరక్షణ దుష్టశిక్షణ గావించి, తిరిగి పదిలంగా స్వామి వారి చెంతకు చేరుకుంటుంది. మనకు సుపరిచితమైన "గజేంద్రమోక్షం" ఘట్టమునందు మొసలి కోరలనుండి గజరాజును రక్షించినది సుదర్శనచక్రమే!

భక్తులు తిరుమల యాత్రకు సంకల్పించినది మొదలు, వారిని ప్రయాణ మార్గంలోనూ, తిరుమల క్షేత్రం లోనూ అనుకోని విపత్తుల నుండి కాపాడి, తిరిగి వారి వారి గమ్యాలకు సురక్షితంగా చేర్చే బాధ్యతను సుదర్శనచక్రం చేపడుతుందని భక్తులు నమ్ముతారు.

సాలగ్రామాలు 

 గర్భాలయం నందు వివిధ ఆకృతుల్లో, పరిమాణాల్లో ఉన్న అనేక సాలగ్రామాలు స్వామివారి పాదాల చెంతనున్న వెండిపళ్లెరంలో కొలువై ఉండి అనూచానంగా పూజాదికాల నందుకుంటున్నాయి. భగవద్రామానుజచార్యులు, వ్యాసతీర్థులవారు, ఇంకా అనేక భక్తశిఖామణులు మూలవిరాట్టును దివ్య సాలగ్రామశిలగానూ, తిరుమల క్షేత్రాన్ని దివ్యసాలగ్రామ మయంగానూ భావించి పూజించారు. పూజలందుకునే సాలగ్రామాలే కాకుండా, మాలలరూపంలో కూడా అనేక సాలగ్రామాలు మాలల రూపంలో అమర్చబడి స్వామివారి కంఠ సీమను అలంకరిస్తున్నాయి. శ్రీ కృష్ణదేవరాయలు గురువుగారైన వ్యాసతీర్థుల వారు బంగారు కవచాలను తొడిగిన సాలగ్రామాలను స్వామివారికి బహుకరించారు. వేరెందరో భక్తులు కూడా తరచుగా స్వామివారికి సాలగ్రామమాలలను సమర్పిస్తున్నారు.రుక్మిణి శ్రీకృష్ణులుగర్భాలయం నందు, కుడిచేతిలో వెన్నముద్దను పెట్టుకొని ఒంటికాలి మీద వయ్యారంగా నిల్చుని ఉన్న బాలకృష్ణుడు, రెండడుగుల ఎత్తైన రుక్మిణి-శ్రీకృష్ణుని వెండి విగ్రహాలు ఎప్పటి నుంచో పూజింప బడుతున్నాయి. రాజేంద్రచోళుని భార్య 1100వ సంవత్సరంలో ఈ విగ్రహాలకు పాలు పెరుగు నైవేద్యం సమర్పించేది.

 ప్రతి సంవత్సరం కనుమనాడు మలయప్పస్వామితో పాటుగా, శ్రీకృష్ణుడు కూడా "పార్వేట ఉత్సవం" లో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల్లో "మోహినీ అవతారం" రోజున, మలయప్ప స్వామితో పాటు మరొక పల్లకిపై శ్రీకృష్ణుడు ఊరేగుతారు. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలను పాడుతూ, చిన్నికృష్ణుని మేల్కొలుపు తారు. అలాగే, ఆ మాసంలో రాత్రివేళయందు భోగశ్రీనివాసమూర్తికి బదులుగా చిన్నికృష్ణునికి పవళింపు సేవ జరుగుతుంది. ద్వాపరపు శ్రీకృష్ణుని కొనసాగింపే కలియుగ వేంకటేశ్వరుని అవతారమని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం!

సీతారామలక్ష్మణులు

గర్భాలయంలో మూలమూర్తికి ఎడమప్రక్కగా, ఒకప్పుడు రాముల వారి మేడలో కొలువై ఉండే సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాలు ఇక్కడికి ఎలా చేరు కున్నాయి అనే విషయంపై రెండు కథనాలు ఉన్నాయి.

త్రేతాయుగంలో సీతమ్మవారిని వెతుక్కుంటూ వెంకటాద్రికి విచ్చేసిన రామలక్ష్మణులకు గుర్తుగా ఈ మూర్తులు ఇచ్చట కొలువై ఉన్నాయి. అందువలననే రామలక్ష్మణులు రాజోచితమైన కిరీటాలు ధరించకుండా, అరణ్యవాసంలో ఉన్నట్లు జడధారులై దర్శనమిస్తారు.

మరో కథనం ప్రకారం - భగవద్రామానుజుల వారు తిరుమలనంబి నుండి శ్రీమద్రామాయణ రహస్యాలను, నడకదారిలోని ఓ ప్రదేశంలో తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఒక సద్ర్బహ్మణుడు వారికి ఈ విగ్రహాలను సమర్పించాడు. తదనంతర కాలంలో తిరుమల నంబి ద్వారా ఇవి ఆనందనిలయం లోనికి చేర్చబడ్డాయి.

గర్భాలయంలోని మూల మూర్తులను తనివితీరా దర్శించు కుని, వెనుదిరిగి, వరుసగా శయనమండపం, రాములవారి మేడ, స్నపనమండపం – మీదుగా బంగారువాకిలి దాటి, జయ- విజయుల అనుమతితో తిరుమామణి మంటపానికి ఉన్న దక్షిణ ద్వారం నుంచి నిష్క్రమించి, తిరిగి విమాన ప్రదక్షిణమార్గాన్ని చేరుకున్నాం.

ప్రధాన వంటశాల (పోటు) 

విమానప్రదక్షిణమార్గంలో ఆగ్నేయదిశగా, ఎత్తైన అరుగులతో ఉండే వంటశాలను "పోటు" అంటారు. ఇదే వాస్తును ఇప్పటికీ మనం అనుసరిస్తూ, ఇంటికి ఆగ్నేయమూలన వంటగదిని ఏర్పాటు చేసుకుంటున్నాం. శ్రీవారిని దర్శించుకుని బయటకు రాగానే మనకు ఎదురుగా ఉండే బంగారుబావికి ఎడమప్రక్కగా ఈ ప్రధాన వంటశాల కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీవారికి సమర్పించే అన్నప్రసాదాలను మాత్రం ఇందులో తయారు చేస్తున్నారు. పూర్వం లడ్డు, వడ వంటి పణ్యారాలను కూడా ఇందులోనే తయారు చేసేవారు. ప్రస్తుతం ఇటువంటి పణ్యారాలను సంపంగి ప్రదక్షిణ మార్గంలో ఉన్న "పడిపోటు" లో తయారుచేస్తున్నారని ఇంతకు ముందే తెలుసుకున్నాం.

ఈ "పోటు" యందు అన్నప్రసాదాలను వంట బ్రాహ్మణులు అత్యంత శుచిగా, నియమనిష్ఠలతో, వేళప్రకారం తయారుచేసి, స్వామివారి నివేదన నిమిత్తం గంగాళాలలో నింపుతారు. "గమేకార్లు" అనబడే పరిచారకులు ఈ ప్రసాదాల గంగాళాలను స్వామివారి సన్నిధికి చేరుస్తారు. పంచభక్ష్య పరమాన్నాలు ఎన్నో తయారైనా, పెరుగన్నాన్ని, మాత్రమే కులశేఖరపడి దాటి, కుమ్మరి భీమన్నకు గుర్తుగా గర్భాలయంలో ఉంచి నివేదన చేస్తారు. దాదాపుగా మిగిలిన ప్రసాదాలన్నీ గర్భాలయం వెలుపలనున్న శయనమందిరం నుండే స్వామివారికి నివేదించ బడతాయి.

 వకుళమాత 

పోటుకు ప్రక్కగా, ఎత్తైన వేదికపై నున్న అద్దాలమందిరంలో, శ్రీవారి తల్లి వకుళమాత సుఖాసీనురాలై, నిత్యపూజ లందుకుంటూ, మనకు దర్శనమిస్తుంది. ముఖారవిందానికి ఎదురుగా ఉన్న ఓ చిన్నరంధ్రం ద్వారా ఆమె, తనయుడైన శ్రీనివాసుని కోసం తయారవుతున్న నైవేద్యాలను పర్యవేక్షిస్తారు. దేశానికి రాజైనా తల్లికి తనయుడే కదా!

అలాగే, బ్రహ్మాండనాయకుడు కూడా తల్లిగారైన వకుళమాత చేతిముద్దలు తిన్నవాడే. వేల ఏళ్లనాటి, ఆ శ్రీనివాసుని బాల్యాన్ని స్ఫురణకు తెచ్చుకుంటూ, తన కుమారునికి సమర్పింపబడే నైవేద్యాలు "శుచిగా, రుచిగా, సమయబద్ధంగా తయారవు తున్నాయా లేదా" అన్న విషయాన్ని వకుళాదేవి అనుక్షణం గమనిస్తూ ఉంటుంది. అందుచేతనే ఈ మాతను "పాకలక్ష్మి" లేదా "పచనలక్ష్మి" అని కూడా అంటారు. 

కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడు వరాహస్వామి అండదండలతో వెంకటాచలంపై స్థిరనివాసం ఏర్పరుచుకున్నప్పుడు, వకుళాదేవి శేషాచల అడవుల్లో పండే శ్యామకధాన్యాన్ని అన్నంగా వండి, తేనెతో కలిపి ప్రేమగా శ్రీనివాసుని తినిపించేదట. ఆ శ్యామకధాన్యాన్ని నేడు తెలంగాణ- రాయలసీమల్లో "కొర్రలు" అని, కర్ణాటకలో "శ్యామలు" అని పిలుస్తారు. ఈ ధాన్యానికి "ప్రియంగు" అనే మరో పేరు కూడా ఉండడం చేత, శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో శ్రీస్వామివారిని "ఓం ప్రియంగు ప్రియాయై నమః" అని కూడా స్తుతిస్తారు. 

ఈ విధంగా, ఆ తల్లి-తనయుల సంబంధం యుగయుగాలుగా, తరతరాలుగా కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో కొందరు అది "వకుళమాత విగ్రహం కాదు. శ్రీమహాలక్ష్మి మూర్తి" అంటున్నారు. కానీ, తి.తి.దే. వారు "వకుళమాత" అంటూ స్పష్టంగా సూచిస్తున్నారు.

బంగారుబావి 

వంటశాల మెట్లను ఆనుకొని, భూమి ఉపరితలం నుండి బంగారు తాపడం చేయబడి ఉన్న బావిని "బంగారుబావి" గా పిలుస్తారు. మహామణిమండపం నుండి బయటకు రాగానే, మన ఎదురుగా ఉన్న కటాంజనాలలో (లోహపు ఊచల పంజరం) దీనిని చూడ వచ్చు. శ్రీవారి బోజనావసరాల నిమిత్తం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు. అందువలన దీనికి "శ్రీతీర్థం" లేదా "లక్ష్మీతీర్థం" అనే నామాంతరాలు ఉన్నాయి. తరువాతి కాలంలో ఆ బావి శిథిలం చెందగా, తొండమాన్ చక్రవర్తిగా పునర్జన్మించిన రంగదాసు అనే శ్రీవారి భక్తుడు,, స్వామివారి ఆనతి మేరకు దీనిని పునరుద్ధరించాడు. శ్రీవారి అభిషేకానికి కావలసిన శుధోదకాన్ని వెయ్యేళ్ళ క్రితం వరకు పాపనాశన తీర్థం నుండి, ఆ తరువాత ఆకాశగంగాతీర్థం నుండి "తిరుమలనంబి" అనే భక్తుడు తీసుకు వచ్చేవారు. తరువాతి కాలంలో తిరుమలనంబి గురువుగారైన యామునా చార్యులవారు, సాక్షాత్తు శ్రీమహాలక్ష్మిచే నిర్మించబడిన తీర్థం స్వామివారి చెంతనే ఉండగా, వేరే తీర్థాలనుండి అభిషేకజలం తీసుకు రావాలసిన అవసరం లేదని భావించినప్పటినుండి, ఈ బంగారుబావి లోని పవిత్రజలాలను శ్రీవారి వంటకాలు, అభిషేక, అర్చనాదుల నిమిత్తం ఉపయోగి స్తున్నారు. ఈ బావిలోని నీరు "సుందరుడైన " స్వామివారికి ఉపయోగపడుతుంది కనుక దీనిని "సుందరస్వామి కూపం" లేదా "సుందరబావి" అని కూడా పిలుస్తారు. ఆ రోజుల్లో స్వామి వారిని "సుందరస్వామి" గా కూడా కీర్తించేవారు.

అయితే, శుక్రవార అభిషేకానికి మాత్రం ఆకాశగంగాతీర్థం నుండి మూడు బిందెల అభిషేకజలాన్ని "తోళప్పాచార్యులు" గా పిలువబడే తిరుమలనంబి వంశీయులు తెచ్చే సాంప్రదాయం నేటికీ కొనసాగు తోంది. పూర్వకాలంలో ఈ బావి నుండి అమర్చిన రాతి కాలువ ద్వారా నీరు వంటశాల లోనికి నేరుగా చేరుకునేది. తరువాతి కాలంలో నీటికుండలతో చేదటం ద్వారా, ప్రస్తుతం విద్యుత్ ద్వారా ఈ బావిలోని నీటిని తోడుతూ వంటలకు ఉపయోగిస్తున్నారు. వేలాది సంవత్సరాల క్రిత నిర్మించ బడ్డ ఈ బావి ఇప్పటికీ పానయోగ్య మైన జలాన్ని ప్రసాదించటం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి మహాత్మ్యమే!ఈ మధ్యకాలంలో, కొండపై గుడి చుట్టూ అనేక నివాసగృహాలు రావడంతో నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉండటంవల్ల, సిమెంటు తాపడంతో ఆ అవకాశం లేకుండా చేసి పాపనాశన తీర్థంలోని నీటితో ఈ బావిని నింపుతున్నారు.

 అంకురార్పణ మంటపం 

 "పోటు" ను దర్శించుకుని ఎత్తైన అరుగు మీద ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు ముందుగా వచ్చేది "అంకురార్పణ మంటపం". బ్రహ్మోత్సవాలకు ముందు రోజున ఈ మంటపంలో, సేకరించుకొచ్చిన పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింప జేయడం వల్ల ఈ మంటపానికి "అంకురార్పణ మంటపం" అనే పేరు వచ్చింది. అంకురార్పణపర్వం గురించి "శ్రీవారి బ్రహ్మోత్సవాలు" లో వివరంగా తెలుసుకున్నాం.

ఒకప్పుడు దేవాలయ అంతర్భాగం నందున్న రాములవారిమేడలో కొలువుండే రామపరివార దేవత లైన ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుని విగ్రహాలు; అలాగే, "నిత్యశూరులు" అనబడే శ్రీమహావిష్ణువు పరివారదేవతలైన విష్వక్సేనుడు,ఆదిశేషువు, గరుత్మంతుడు విగ్రహాలను – ప్రస్తుతం ఈ మండపంలో దర్శించుకోవచ్చు. శ్రీవారి దర్శనానంతరం తీర్థం, శెఠారిని ఈ మంటపం ఎదురుగానే భక్తులకు ప్రసాదిస్తారు. రాత్రివేళల్లో స్వామివారి ఏకాంతసేవ పూర్తయి, ఆలయ ద్వారాలు మూసిన తరువాత, బ్రహ్మాది దేవతలు విచ్చేసి స్వామిని కొలుస్తారని ఓ గట్టి నమ్మకం. వారు అర్చించు కోవడం కోసం, ప్రతిరోజు ఆలయద్వారాలు మూసేటప్పుడు ఐదు బంగారు గిన్నెలలో ఆకాశగంగ తీర్థం నింపిఉంచుతారు. ఉదయం సుప్రభాతం తర్వాత విశ్వరూపసందర్శనం కోసం విచ్చేసే భక్తులకు అంకురార్పణ మండపంలో ఇచ్చేది ఈ తీర్థమే!! దీన్నే "బ్రహ్మతీర్థం" గా పిలుస్తారు.బ్రహ్మ కడిగిన విష్ణు పాదోదకం గనుక, ఈ తీర్థాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

 యాగశాల 

 అంకురార్పణ మండపానికి ఆనుకుని ఉన్న "యాగశాల" లో పూర్వం హోమాలు, యజ్ఞ యాగాదులు వంటి వైదికక్రతువు లన్ని జరుగుతుండేవి. కానీ ప్రస్తుతం స్థలాభావం, భక్తులరద్దీ చేత ఈ క్రతువుల్లో చాలావరకూ సంపంగిప్రాకారం లోని "కళ్యాణ మండపం"లో జరుప బడుతున్నాయి. బుధవారం నాడు జరిగే సహస్రకలశాభిషేకం సమయంలో మాత్రం, బంగారు వాకిలి వద్ద ఏర్పాటు చేయబడిన తాత్కాలిక యజ్ఞగుండంలో యాగం నిర్వహింపబడుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు ,

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.