పురాణం

 


కష్టపెట్టటం బాధాకరమనే విషయాన్ని అందరూ గుర్తించలేరు. కాని, కష్టపడటం బాధాకరం అనే సత్యం వంటబట్టని వారుండరు. 

నిజానికి ఇవి రెండు విషయాలు కావు. విషయప్రధానంగా చూచినా, విషయి ప్రధానంగా చూచినా కష్టము ఒక్కటే. కష్టపడేవారెవరైనా ఆ వ్యక్తి మనిషే. ఒక్కడే లేదా ఒక్కతే.

బాధ అనేది సుఖంగా భరించదగినది కాదు. గాయం మచ్చను ముద్రిస్తుందని కచ్చితంగా చెప్పలేము. బాధమాత్రం గుండెపై చెదరని ముద్రను వేస్తుందని గంటకొట్టి మరీ చెప్పొచ్చు. గుండెకు తెలియకుండా గండికొట్టేవి బాధలు.

బ్రతుకంతా వీడని నేస్తంలా వెంటాడే బాధల పురాణాన్ని స్పష్టంగా అర్థం చేసుకోకపోతే, జీవితంలో ప్రతివిషయం అస్పష్టంగా, అయోమయంగా గోచరిస్తుంది. ఈవిధమైన బ్రతుకు చీకటికి చుట్టమే గాని వెలుగుకు బంధువు కాలేదు.

ఎందుకు పుట్టామో తెలుసుకొనే సత్తా అందరి సొత్తు కాకపోయినా, ఆలోచిస్తే,ఎలా పుట్టామో సులభంగా తెలుసుకోవచ్చు. తల్లి బాధపడితేనే నేను బయటపడ్డాను. మరొకరిని బాధపెట్టటంలోనే నా బ్రతుకు శ్రీకారం చుట్టింది.

ఆ తరువాత…? నేను పెరగటానికి ఎందరో కష్టపడ్డారు. ఇదంతా నాకు తెలిసి జరగలేదు. కాని, పెరుగుతూ, తిరుగుతూ, తెలిసో, తెలియకో, ఇతరుల్ని ప్రయత్న పూర్వకంగా బాధించే నిర్వాకానికి ప్రతి మనిషి సిద్ధపడతాడు. ఇంతకీ వడ్లగింజలో బియ్యపు గింజలా తేలేదేమిటి? ఒక వ్యక్తి బాధపడటం. ఒక వ్యక్తి…ఒక వ్యక్తి…ఒక వ్యక్తి…ఒకే వ్యక్తి.

ఆ వ్యక్తి ఎవరు? నీవు కష్టపెట్టే మరొకరు కావచ్చు. మరొకరు కష్టపెట్టే నీవు కావచ్చు. మొదటి విషంలో మచ్చపడేది వేరొక గుండెపై అనుకుంటే, రెండవ విషయంలో ఆ మచ్చను ధరించేది నీ గుండె. నా గుండే. ఎవరి గుండె అయినా గుండె ఒక్కటే. ఇలా ఓటికుండల లాగా పగిలిన గుండెలు ప్రోగయిన కుటుంబం గాని, సమాజంగాని, దేశం గాని, సంస్థగాని, బ్రతికితే బ్రతకవచ్చునేమోగాని బట్టకట్ట భవ్యంగా జీవించలేదు.

అమాయకమో, అజ్ఞానమో, ఏదయితేనేమి! మరొకరిని తెలిసో తెలియకో బాధించటం బ్రతుకులో భాగమైపోయింది. బాల్యము నుండి ఇదే ఆట. ఈగను కొట్టి చంపటం, తూనీగను పట్టి తోక విరచటం, ఒకరిని గిల్లటం, మరొకరిపై బురద చల్లటం-ఇవన్నీ మరొకరిని బాధించే కార్యాలు. ఎవరూ చెప్పకుండా వంటపట్టిన వినోదాలు. ఒకనాడు పసితనంలో కదిలిన ఈ వినోదాలే మరోనాడు విరబూసిన బ్రతుకులో వెదజల్లబడే వికారాలు… నిజానికి విషాదాలు. విషాదం అనందంగా అందుకొనే ప్రసాదం కాదు. తృప్తిగా అనుభవించే భోగం కాదు. నిజానికి, అది గుండెను పట్టుకొనే రోగం.

తప్పులు చేస్తూ బ్రతుకు పెరగటం తప్పు కాదు. పెరిగే బ్రతుకు తప్పులను సరిదిద్దుకోలేకపోతే బ్రతుకు బండబారిపోతుంది. భారమైపోతుంది. సుఖమనేది మనిషికి దూరమైపోతుంది.

నేను ఒక వ్యక్తిని బాధపెడితే అతని హృదయం మెలికలు తిరిగిపోతుంది. అది బాధ. అతను పడే బాధ. అది బాధ అని పడేవాడికే కాదు; బాధపెట్టిన నాకు కూడా తెలుసు. ఇది కూడా జ్ఞానమే. బాధల జ్ఞానము. బాధపడేవారు ప్రత్యక్షంగా అనుభవిస్తారు. బాధపెట్టేవారు పరోక్షంగా అనుభవిస్తారు. బాధలో వ్యత్యాసాలుండవచ్చునేమోగాని బాధ మాత్రం ఒక్కటే. ఈ పరమసత్యాన్ని గ్రహించటానికి మనిషి పడమటి చూపును తూర్పునకు త్రిప్పుకుంటే సరిపోతుంది. బ్రతుకులో తూర్పార పట్టటము మొదలవుతుంది. ఈ పవిత్ర కార్యములో వ్యధలతో నలిగిన గుండెలలో పిండారబోసినట్లు వెన్నెలలు నిండుకుంటాయి.

ఇంతకీ, చెప్పొచ్చిందేమిటంటే-పిండుకుంటే పాలొస్తాయి. గుండెల్ని పిండుకుంటే నీళ్లొస్తాయి. కన్నీళ్లొస్తాయి. మరొకరిని బాధించటములో మన బాధ కూడా మనకుంటుంది అనే సత్యాన్ని వంటబట్టే వరకు ఆలోచించాలి. అంతేకాదు. నీ గుండెను పిండే కార్యం కూడా ఎంత మంచిదయినా దానిని త్యజించటమే త్యాగం. ఇతరులకు కాంతినిచ్చి తాను కాలి కనుమరుగయ్యే క్రొవ్వొత్తి కవులకు కథావస్తువైతే, తాను వెలుగుతూ వెలుగునిస్తూ, తనలో వెలుగులారని భానుడే మనకు మిత్రుడు. అతడు మనకు కథావస్తువు కాదు, కథానాయకుడు. ఇది బోధపడితే మన జీవిత కథ ఒక మలుపు తిరుగుతుంది. సుఖానికి పిలుపునిస్తుంది. శాంతికి తలుపు తడుతుంది.

ఇప్పటి వరకు తెలియక ఎందరినో బాధించాము. ఇక తెలిసినవారమై, తెలివిగలవారమై ఎవరినీ బాధించకుండా (సాధ్యమైనంత వరకు) జీవిద్దాం. అంతేకాదు. ఇంతవరకు తెలియక మనం కొని తెచ్చుకొని బాధలనను భవించాం. ఇక మీదట బాధలు అంటకుండా గుండెల్ని కాపాడుకుంటాం. జీవితం చాలా విలువైంది అనే వాక్యం పెద్ద విలువైనది కాదు. విలువలను జీర్ణించుకొని బ్రతికితే జీవితం ఎలా విలువైనదో తెలుస్తుంది. ఇలా బ్రతికే జీవితము భవ్యము. ఇలా బ్రతికేవాడే ధన్యుడు. అతడే భక్తుడు.

యస్మాత్‌ న ఉద్విజతే లోకః లోకాత్‌ న ఉద్విజతే చయః

ఎవరి వలన లోకానికి ఉద్వేగము లేదో, లోకము వలన ఎవనికి ఉద్వేగముండదో, భయముండదో, బాధలుండవో, అతడే భక్తుడని భగవద్గీత భవ్య సందేశము. ఇది ఆదేశం కాదు. నిర్దేశం కాదు. సందేశం. దేశాలు కారిపోయినా, కాలాలు మారిపోయినా, కారిపోని, మారిపోని సందేశం. సందేశాలను విని సంబరపడితే లాభముండదు. సంబరంతో సందేశాలను బ్రతుకులో సందర్శిస్తేనే సమదర్శనం. సమ్యక్‌ దర్శనం. సందర్శనం.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు